← Back to Events
రెవెన్యూ అధికారుల ఆస్తులపై ఏటా అడిట్ చేయాలి
వరంగల్2026-06-29

రెవెన్యూ అధికారుల ఆస్తులపై ఏటా అడిట్ చేయాలి

రెవెన్యూ అధికారుల ఆస్తులపై ఏటా ఆడిట్ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సోదాలు జరపాలి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య వరంగల్,జూన్26(అక్షరజ్యోతి ప్రతినిధి):ఈ మధ్యకాలంలో ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో ఎక్కువ శాతం రెవెన్యూ శాఖకు చెందినవారు ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని అరికట్టేందుకు రాష్ట్రంలోని రెవెన్యూ శాఖ అధికారుల, ఉద్యోగుల ఇళ్లల్లో ఒకేసారి సోదాలు నిర్వహించి లెక్కల్లో చూపని ఆదాయాన్ని జప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో చదువుతుంటే ఆ యూనివర్సిటీలకు సమాచారం ఇచ్చి లంచాల సొమ్ముతో చదువుతున్నారనే విషయాన్ని తెలియజేయాలని, ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో విచారించాలని కోరారు. నిజాయితీగా సంపాదించిన సొమ్ముతో చదివితే సమస్య లేదని, లేకపోతే విద్యార్థులను ఇండియా రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసిల్దార్లతో పాటు ఆర్డీవోలు, కలెక్టరేట్ సిబ్బంది ఆస్తులను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆడిట్ చేయాలని, ఆస్తి వివరాలను బహిరంగంగా వెబ్‌సైట్‌లో ఉంచాలని అన్నారు. ఈ విధానాన్ని ఇంజనీరింగ్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు వర్తింపజేసి అన్ని డిపార్ట్‌మెంట్లలో ఒకేసారి ఏసీబీ, ఈడీ, ఆదాయపన్ను శాఖల సంయుక్త సోదాలు జరపాలని డాక్టర్ భద్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. లంచగొండి అధికారుల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సర్టిఫికెట్లు, భూ సమస్యలు, అనుమతుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఇలాంటి వ్యవస్థను ప్రక్షాళన చేస్తేనే ప్రజలకు నిజమైన సుపరిపాలన అందుతుందని ఆయన పేర్కొన్నారు.