← Back to Events
దైవాలగూడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిటీ ఆందోళన*
హైదరాబాద్2026-07-18

దైవాలగూడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిటీ ఆందోళన*

*దైవాలగూడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిటీ ఆందోళన* *నేరాలకు, ఘోరాలకు సంబంధించిన మూలాలను లోతుగా విశ్లేషించాలి* *రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నిసా* హైదరాబాద్,జూలై12(అక్షరజ్యోతి ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో జరిగిన ఆరుగురి సామూహిక హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారిపై అత్యాచారం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తి మళ్లీ ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేయడం న్యాయ వ్యవస్థలో, శిక్షల అమలులో ఉన్న లోపాలను స్పష్టంగా చూపిస్తోందని రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నిసా అన్నారు. ఇటీవల రాష్ట్రంలో కుటుంబాల్లో హత్యలు, దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, భర్తలు భార్యలను, భార్యలు భర్తలను, తల్లిదండ్రులు కన్నబిడ్డలను కూడా చంపుకుంటున్న ఘటనలు సమాజంలో మానవీయ విలువలు క్షీణిస్తున్నాయనడానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆర్థిక ఒత్తిళ్లు, నిరుద్యోగం, మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో హింసను ప్రేరేపించే కంటెంట్ ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. నేరాలను కేవలం కఠిన శిక్షలతోనే కాకుండా మూలాల వద్ద నుంచి నివారించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రభుత్వం సమగ్ర విధానం రూపొందించాలని కోరారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా పోస్టులు, హింసాత్మక వీడియోలు, ప్రజలకు ఉపయోగపడని యూట్యూబ్ సందేశాలపై ప్రభుత్వం కఠిన నిఘా పెట్టి వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయ సహాయం, ఆర్థిక పరిహారం అందించడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆధ్వర్యంలో త్వరలో అన్ని జిల్లాల కమిటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో నేరాల స్వభావం, కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు సురవరం రాజేంద్రప్రసాద్, తిరునగరి లావణ్య, అర్జున్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.