
ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డిని సన్మానించిన డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్, ఉపసర్పంచులకు అభినందనలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ముత్యంపేట గ్రామంలో భక్తులకు సంబంధించిన సులభ కాంప్లెక్స్ సంబంధించిన బాట కబ్జాకు గురైన సందర్భంలో జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాటను పునరుద్ధరించడానికి ఒక ఏడాది కాలం పాటు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనేక విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొండగట్టు గ్రామాన్ని సందర్శించిన సమయంలో మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తానని మంత్రి ముందు జాతీయ మానవ హక్కుల కమిటీ నేతలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ ఆదిరెడ్డి, ఉపసర్పంచ్ ముత్యంరెడ్డి సులభ కాంప్లెక్స్ కు సంబంధించిన బాటను పునరుద్ధరించడానికి కబ్జాకు గురైన అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో కూలగొట్టించారు. భక్తులకు సౌకర్యవంతంగా సులభ కాంప్లెక్స్ పరిసరాలను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) జగిత్యాల జిల్లా నేతలు లేవనెత్తిన సమస్యను మంత్రి సహకారంతో పరిష్కరించిన గ్రామసర్పంచ్ దారం ఆదిరెడ్డిని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఘనంగా సన్మానించి అభినందించారు. ఉపసర్పంచి ముత్యంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించిన వారు చరిత్రలో నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూట శేకర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి సామల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు కోల రాజేశం గౌడ్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ళ సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, భూపాలపల్లి జిల్లా నాయకులు గొల్లపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.