
ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
*ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి* *రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేత* *జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం రఘునాథ్* హైదరాబాద్,జూలై22(అక్షరజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధి తీవ్ర సంక్షోభంలో ఉందని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుతో ఆటో డ్రైవర్ల రోజువారీ ఆదాయం 40 శాతం వరకు పడిపోయిందని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం రఘునాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేసిన ఆయన, ప్రస్తుతం రోజుకు ₹200–₹300 కూడా మిగలని పరిస్థితి ఉందని, ఫైనాన్స్ కిస్తీలు, బ్యాంకు రుణాలు, అద్దె, ఇంధన ఖర్చులు తీర్చలేక ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటివరకు రాష్ట్రంలో 150 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి ₹12,000 ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక కార్పొరేషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం ₹100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఏ కారణంతో మరణించినా ₹5 లక్షల బీమా, 50 ఏళ్లు దాటిన వారికి నెలకు ₹10,000 గౌరవ పెన్షన్, తక్కువ వడ్డీ రుణాలు, బీమా ప్రీమియం తగ్గింపు, అనధికారిక రవాణా కార్మికుల సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, యాప్ ఆధారిత సేవల కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆటో వ్యాపారం 50 శాతం వరకు తగ్గిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు జీవన భద్రత కల్పించాలని దుర్గం రఘునాథ్ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.