
పెట్రోల్ బంకులలో టైర్లలో గాలి సౌకర్యం కల్పించని యజమానులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
*పెట్రోల్ బంకుల్లో టైర్లకు గాలి సౌకర్యం కల్పించని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి* *జిల్లా కలెక్టర్,ఎస్పీ స్పందించాలని విజ్ఞప్తి* *జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు* ములుగు: జిల్లాలోని అధిక శాతం పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు కనీస సౌకర్యమైన టైర్లకు గాలి నింపే సౌకర్యం కూడా లేకపోవడం దుర్మార్గమని జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు తీవ్రంగా విమర్శించారు. ఎక్కడైనా మిషన్ ఉన్నా మరమ్మతుకు వచ్చిందని,కరెంట్ లేదని చెప్పి వాహనదారులను బంకు యజమానులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు వేలాది వాహనాలు జిల్లా గుండా ప్రయాణిస్తుంటాయి. గాలి సౌకర్యం లేకపోవడంతో టైర్లలో గాలి తక్కువగా ఉండి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. పెట్రోల్,డీజిల్ కొన్న ప్రతి వినియోగదారుడికి ఉచితంగా గాలి నింపే సౌకర్యం కల్పించడం బంకు యజమానుల బాధ్యత అని, ఈ విషయంలో పెట్రోలియం నిబంధనలు కూడా స్పష్టంగా పేర్కొన్నాయని గుర్తు చేశారు. అయినప్పటికీ బంకుల యజమానులు నిబంధనలను గాలికి వదిలేసి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున గౌరవ ములుగు జిల్లా కలెక్టర్, గౌరవ జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి,ప్రతి బంకులో పని చేసే స్థితిలో గాలి మిషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని బంకులపై లైసెన్స్ రద్దుతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని,బంకు యజమానులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించరాదని, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సన్నగుండ్ల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.